కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibouli Lands) వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో (TG High Court) పిటిషన్ దాఖలు చేసింది. 400 ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్ తయారు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ ఏఐ వీడియోలు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొంది. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. అనంతరం ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది.
ఇదిలా ఉంటేఈ వివాదంపై ప్రభుత్వం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల హెచ్‌సీయూ భూముల వేలానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), మంత్రుల కమిటీతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజా సంఘాల ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.