TG High court sensational verdict: అత్యాచార కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏకాంత యువతి సాక్ష్యాన్ని సత్యంగా అంగీకరించలేమని పేర్కొంటూ.. నాంపల్లి కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది.
సాక్ష్యం ఒక్కటైనా ఉండాలి: అత్యాచార కేసుల్లో నమ్మశక్యంకాని ఏకాంత సాక్ష్యాన్ని తాము సత్యంగా అంగీకరించలేమని హైకోర్టు పేర్కొంది. బాధితురాలి సాక్ష్యాన్ని బలపరిచే వైద్యపరమైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని తేల్చి చెప్పింది. అత్యాచార కేసుల్లో అత్యంత విశ్వసనీయమైన సాక్ష్యం ఒక్కటైనా ఉండాలని పేర్కొంది. నిరూపించదగిన ఒక్క సాక్ష్యం ఉన్నా.. మిగిలిన ఆధారాలతో సంబంధంలేకుండా శిక్ష విధించవచ్చని పేర్కొంది. పై తీర్పునిస్తూ.. హైదరాబాద్ కిషన్‌బాగ్‌కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్‌ఖాన్‌కు అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది.
అసలేం జరిగిందంటే: మహమ్మద్ ఇర్ఫాన్‌ఖాన్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో దగ్గరై.. ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి తనపై లైంగిక చర్యకు పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై 2009 ఏప్రిల్‌లో బహదూర్‌పుర పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో విచారణ జరిపిన ఎంఎస్‌జే కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ మహమ్మద్ ఇర్ఫాన్‌ఖాన్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
అలాంటి ఆధారాలు లేవు: ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జె.శ్రీనివాసరావు స్పందిస్తూ సంచలన తీర్పు వెల్లడించారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉండి.. 2008 నవంబరులో ఇంటికొచ్చి భయపెట్టి లైంగికచర్యకు పాల్పడ్డాడంటూ 2009 ఏప్రిల్‌లో యువతి ఫిర్యాదు చేయడంపై తీర్పు వెలువరించారు. ఘటన జరిగిన 6నెలల తరువాత ఫిర్యాదు చేయడంతో వైద్యపరీక్షల్లో ఇద్దరికీ 18 ఏళ్లు దాటాయని తప్ప మరో ఆధారం లభించలేదని న్యాయమూర్తి అన్నారు. ఎఫ్‌ఐఆర్ జాప్యంపై వివరణ లేకపోవడంతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలు కూడా లేవని తీర్పులో తెలిపారు. బాధితురాలు రాతపూర్వకంగా, మౌఖికంగా ఇచ్చిన ఫిర్యాదుల్లో పలు వ్యత్యాసాలుండటాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తన తీర్పులో హైకోర్టు పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశారన్నదానికి ఆధారాలు లేవని చెప్పిన కింది కోర్టు.. అదే ఆరోపణపై శిక్ష విధించడం సరికాదని తెలిపింది. కేవలం బాధితురాలి ఏకాంత సాక్ష్యం ఆధారంగా నిందితుడికి విధించిన జైలు శిక్షను రద్దు చేస్తున్నట్లు జస్టిస్ జె.శ్రీనివాసరావు తన తీర్పును వెలువరించారు.


