Hyderabad| తెలంగాణ హైకోర్టు(TG High Court) హైదరాబాద్ వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై నగరంలోని రోడ్లపై వాహనాలు నడిపే వాహనదారులంతా హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా.. రాంగ్ రూట్లో వాహనాలు నడిపినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటిదాకా విధించే జరిమానాలను రెట్టింపు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఇక నుంచి హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే గతంలో రూ.125 ఉండగా.. ప్రస్తుతం రూ.200 వసూలు చేయాలని పోలీసులకు సూచించింది. అలాగే రాంగ్ రూట్‌లో వాహనం నడిపినందుకు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉండగా.. దానిని రూ.2000 చేసింది.
కాగా హైదరాబాద్‌లో రోజురోజుకు వాహనాలు నడిపే సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ప్రమాదాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇందులో హెల్మెట్ లేకపోవడంతో పాటు రాంగ్ రూట్లో వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అయినా కానీ వాహనదారుల్లో మార్పులు రాకపోవడంతో హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.