Ganesh Immersion:రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్నచిన్న ఘటనల మినహా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలీసులు అన్ని శాఖలు, గణేశ్ మండపాల నిర్వహకులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. హైదరాబాద్‌లో కూడా ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం అనుకున్న సమయానికి ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

నెలరోజుల ముందు నుండే..
గణేశ్ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా పూర్తిచేసేందుకు నెలరోజుల ముందు నుండే పోలీసులు ప్రణాళికాలు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందితో నిరంతరంగా చర్చించి నిమజ్జనం నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు మ్యాప్, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మండపాల వద్ద జన సమూహాన్ని అదుపు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. ఇక హైదరాబాద్‌లో కూడా గణేశ్ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేసింది. ఉత్సవాల నిర్వాహకులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, జీహెచ్ఏంసీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో నగర సీపీ సీవీ ఆనంద్ సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు.
వివిధ జోన్ల లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అధికారులతో చర్చించి నిమజ్జనం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశ్‌తో పాటు బాలాపూర్ గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు అని అంచనా వేసిన పోలీసులు దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్, బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా డీజీపీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్ నిమజ్జనం ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేస్తూ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులతో పాటు ఎక్సైజ్, ఫారెస్ట్, ఆర్పీఎఫ్, టీజీఎస్పీ బెటాలియన్స్ తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుండి అదనపు సిబ్బందిని రప్పించారు. దాదాపు 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్‌సాగర్ వద్దే సుమారు 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ విగ్రహం తరలింపు వాహనానికి క్యూఆర్ కోడ్ జారీ చేశారు. 250 సీసీ కెమెరాలు, 9 డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. దాదాపు 40 గంటలపాటు నగరంలో గణేశ్ శోభయాత్ర కొనసాగింది. కాగా నిమజ్జనం ప్రక్రియను ప్రశాంతంగా పూర్తిచేయడానికి పోలీసులు రెండురోజుల పాటు నిద్రలేకుండా బందోబస్తు వీధుల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గణేష్ నిమజ్జనం వేడుకల్లో మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నవారిపై షీ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కేవలం ఏడురోజుల వ్యవధిలోనే సుమారు 900 మంది పోకిరీలను షీ టీం అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా షి టీమ్స్ పోకిరీలపై నిఘా పెట్టాయి.
అందరికీ ధన్యవాదాలు
హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనం ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, ప్రజలు పోలీసులకు ఎంతగానో సహకరించారని అన్నారు. వారందరికీ హైదరాబాద్ సిటీ పోలీసుల తరుఫున ధన్యవాదాలు తెలిపారు.


