Job Calendar: రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్‌కు కాలదోషం పట్టింది. ఏటా జ్యాబ్ క్యాలెండర్ ప్రకారం కొలువులు భర్తీ చేస్తామని సర్కార్ ఇచ్చిన హామీ నెరవేరడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎలక్షన్లు.. ఇలా ఏదో ఒక కారణంతో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇచ్చి మాట అటకెక్కింది. మొన్నటిదాకా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామంటున్న ప్రభుత్వం మరో 40 వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధమని.. అందులో భాగంగానే వివిధ శాఖల నుంచి ఖాళీల డేటా సేకరించే ప్రక్రియ కూడా పూర్తయిందని సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. బీసీల రిజర్వేషన్ల అంశంతో ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతున్నది. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే ఇప్పట్లో నోటిఫకేషన్లు వచ్చే అవకాశం లేదంటున్నారు. అదే జరిగితే కొత్త ఏడాదే కొలువుల భర్తీపై ప్రకటనలు వెలువడొచ్చు అంటున్నారు. అయినా నిరుద్యోగులు అధైర్యపడొద్దని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇస్తున్నారు. నోటిఫికేషన్లపై సోషల్ మీడియాలో, బయట జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరుతున్నారు. కొంత ఆలస్యమైనా తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. కానీ మాటిమాటికి నోటిఫికేషన్లు వాయిదా పడుతుండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
నెరవేరని ఎన్నికల హామీ
గత ప్రభుత్వాన్ని గద్దె దించడంలో నిరుద్యోగుల పాత్రే కీలకం. నోటిఫికేషన్ల విషయంలో జాప్యం, నియామక ప్రక్రియ పూర్తికావడానికి ఏళ్ల తరబడి ఎదురుచూడటం, కోర్టు కేసుల లాంటివి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. తమ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో లక్షా యాభై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పినా నిరుద్యోగులు విశ్వసించలేదు. పేపర్ లీకేజీ లాంటివి ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. సర్వీస్ కమిషన్ పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టింది. వారి అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకుంది. పేపర్ లీకేజీ అంశాన్ని ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేసింది. అదే సమయంలో తమకు అవకాశమిస్తే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది..? ఎప్పుడు పరీక్ష నిర్వహించబోతుంది..? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేయనుంది తేదీలతో సహా వెల్లడించింది. కానీ, ఇవేవీ అమల్లోకి రాలేదు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. గత బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లతోనే కాంగ్రెస్ సర్కార్ నియామాక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నే అనుసరిస్తుందని నిరుద్యోగులు టీజీపీఎస్సీ భవనం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కార్ ఈ చర్యను అణచివేసింది.
2022 ప్రకటన తర్వాత అనేక నోటిఫికేషన్లు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 మార్చిలో అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు చాలా నోటిఫికేషన్లు వచ్చాయి. అయితే, అవన్నీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి వివిధ స్టేజీల్లో ఆగిపోయాయి. ఈలోగా ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ల కంటే గతంలో ప్రభుత్వ హయాంలో విడుదలై వివిధ దశల్లో ఆగిపోయిన నియామక ప్రక్రియను పూర్తి చేస్తూ వస్తోంది. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత నోటిఫికేషన్ల ప్రక్రియను పూర్తి చేసి, అవి తమ ఖాతాలో వేసుకుంది. ప్రభుత్వాలు మారినా ప్రక్రియ కొనసాగించడం ఆనవాయితే. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న 60 వేల ఉద్యోగాలలో మెజారిటీ గత ప్రభుత్వం హయాంలో వచ్చినవే అంటూ నిరుద్యోగులతో పాటు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ఒక్క ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మినహా సంపూర్ణంగా అమలు చేయలేకపోతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆర్థిక ఇబ్బందులు కారణం కావొచ్చు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు.. కొలువుల భర్తీ విషయంలోనూ వాస్తవాలు చెబితే బాగుండేది. కానీ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనన్ని ఉద్యోగాలు తాము ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటోంది. ఈ అంశాన్ని ఫ్లెక్సీలు, పత్రికల్లో ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకుంటోంది. అంతటితో ఆగకుండా సీఎం సహా మంత్రులంతా నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని అసత్యాలు మాట్లాడుతుండటంపై నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీతో పాటు అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు కూడా చేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని అర్థం చేసుకొని వాళ్లకు సర్దిచెప్పాల్సింది పోయి.. ప్రభుత్వం వాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. ధర్నాలు, నిరసనలు చేస్తున్నవాళ్లు నిరుద్యోగులే కాదని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు అనేక ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని కొన్ని నెలల కిందటే సీఎం రేవంత్ రెడ్డి అన్నదాంట్లో వాస్తవం ఉంది. దయాకర్‌ను నిరుద్యోగులు ప్రశ్నించిన తర్వాతైనా సీఎం రేవంత్ వాస్తవాలు మాట్లాడతారని అంతా ఆశించారు. కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో పాత పాటే పాడారు. సీఎం అవే అసత్యాలు చెప్పారని విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సొంతూళ్లకు నిరుద్యోగులు
నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కోరారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 40 వేల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని చెబుతోంది. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇప్పట్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదని భావించిన నిరుద్యోగులు.. సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లు ఖాళీ అయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ సైతం బీఆర్ఎస్‌ను అనుసరిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాడానికి వెనుకాడబోమని నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఎన్నికలు ముగియగానే..?
మరోవైపు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల తర్వాత కచ్చితంగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలుస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతుండటంతోనే నోటిఫికేషన్లలో జాప్యం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.


