TGSRTC Karthika Masam tours : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతాయి. ఈ పవిత్ర మాసంలో పుణ్యక్షేత్రాలను, ముఖ్యంగా పంచారామాలను, అరుణాచలాన్ని దర్శించుకోవాలని ఎంతోమంది భక్తులు ఆశిస్తుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఒక శుభవార్తను అందించింది. భక్తులను సురక్షితంగా శైవ క్షేత్రాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఇంతకీ ఏయే క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నారు? ఏయే డిపోల నుంచి ఈ సౌకర్యం ఉంది? టికెట్ ధరలు, యాత్ర వివరాలేంటి?
పరిగి నుంచి ఆధ్యాత్మిక యాత్రలు : భక్తుల సౌకర్యార్థం, పరిగి డిపో నుంచి రెండు ప్రధాన ఆధ్యాత్మిక యాత్రలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
1. పంచారామ క్షేత్రాల దర్శనం: ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పవిత్ర శివ క్షేత్రాలను (పంచారామాలు) సందర్శించాలనుకునే వారి కోసం ఈ యాత్రను రూపొందించారు.
యాత్ర ప్రారంభం: నవంబర్ 2వ తేదీన పరిగి నుంచి బస్సు బయలుదేరుతుంది.
దర్శనీయ క్షేత్రాలు: అమరావతి (అమరలింగేశ్వర స్వామి), భీమవరం (సోమేశ్వర స్వామి), పాలకొల్లు (రామలింగేశ్వర స్వామి), సామర్లకోట (కుమార భీమేశ్వర స్వామి), ద్రాక్షారామం (భీమేశ్వరస్వామి) ఆలయాలను సందర్శిస్తారు.
తిరుగు ప్రయాణం: నవంబర్ 4వ తేదీ ఉదయానికి తిరిగి పరిగికి చేరుకుంటారు.
టికెట్ ధర: ఈ రెండు రోజుల యాత్రకు టికెట్ ధరను రూ.2,500గా నిర్ణయించారు.
2. అరుణాచల గిరి ప్రదక్షిణ: తమిళనాడులోని ప్రఖ్యాత శైవ క్షేత్రం అరుణాచలం వెళ్లాలనుకునే వారి కోసం ఈ ప్రత్యేక సర్వీసు నడుపుతున్నారు.
యాత్ర ప్రారంభం: నవంబర్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు పరిగి నుంచి బస్సు బయలుదేరుతుంది.
దర్శనీయ క్షేత్రాలు: మార్గమధ్యంలో కాణిపాకం, వేలూరు స్వర్ణ దేవాలయం (మహాలక్ష్మి ఆలయం) దర్శనం అనంతరం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారు. తిరుగు ప్రయాణంలో శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబను సందర్శించుకుంటారు.
తిరుగు ప్రయాణం: నవంబర్ 6వ తేదీన తిరిగి పరిగికి చేరుకుంటారు.
టికెట్ ధర: ఈ మూడు రోజుల యాత్రకు టికెట్ ధర రూ.2,000గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 9490215648 నంబరులో సంప్రదించవచ్చు.
”కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. వారు కోరితే మరిన్ని ఆలయాలకు కూడా బస్సులు పంపేందుకు సిద్ధంగా ఉన్నాం.” – కృష్ణమూర్తి, డిపో మేనేజర్, పరిగి
తాండూరు, వికారాబాద్ నుంచి కూడా.. : తాండూరు, వికారాబాద్ ప్రాంతాల భక్తుల కోసం కూడా శ్రీశైలం, పంచారామాలు, అరుణాచలం వంటి క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు, ఒకే గ్రామం నుంచి 30 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే, వారి కోసం ప్రత్యేకంగా బస్సును నడిపించేందుకు ఆర్టీసీ ముందుకొచ్చింది. ఈ సౌకర్యంపై ఆసక్తి ఉన్నవారు 8309348157 నంబరులో సంప్రదించి, బుకింగ్ చేసుకోవచ్చు.


