హైదరాబాద్– విజయవాడ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ అందించింది. నాన్ ఏసీ లహరి స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీని అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడానికి అధికారిక http://tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. ఈమేరకు TGSRTC ఛైర్మన్ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాట్ల పై నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భక్తులు ఇబ్బంది పడకుండా బస్సు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
