TGSRTC Special Buses For Dasara Festival: తెలంగాణలో అతిపెద్ద పండుగలా జరుపుకునే బతుకమ్మ, దసరా సందర్భంగా అంతా నగరాల నుంచి సొంతూళ్లకు పయనమవుతున్నారు. నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన బస్టాండ్లు అన్నీ రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే 2 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను, టీజీఎస్ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయినప్పటికీ, బస్సుల సంఖ్య ఏమాత్రం సరిపోవడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు ప్రధాన బస్టాప్‌లు కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు వెళ్లే బస్సులు సైతం అత్యంత రద్దీగా మారిపోయాయి. జేబీఎస్ బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 2 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ప్రతి పది నిమిషాలకో బస్సు..
కాగా, పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్,.. ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి.. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయని తెలిపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతామని, గురువారం రాత్రి 10 గంటల వరకు వెయ్యికిపైగా ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఏపీ జిల్లాలకు తరలి వెళ్లాయని అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకు వీలుగా అదనపు ఈ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. అయితే, ప్రత్యేక బస్సుల్లో 50 శాతం చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దసరా, దీపావళి పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 1,400 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. అక్టోబరు 1 నుంచి నవంబరు 30 వరకు వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. స్టేషన్లలో అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.


