TGSRTC Special Discounts: మీరు హైదరాబాద్-విజయవాడ రూట్ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తుంటారా? అయితే మీ కోసం తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా బస్సుల్లో టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. పూర్తి వివరాలను కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం..
హైదరాబాద్ – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆ రూట్ లో ప్రయాణించే బస్సుల టికెట్ ధరలపై కనీసం 16శాతం నుంచి గరిష్ఠంగా 30శాతం వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
ఏఏ బస్సుల్లో ఆఫర్ ఎంతంటే
గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరపై 30శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26శాతం ఇవ్వనున్నట్లు తెలిపింది. సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో 20శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు వర్తించనున్నట్లు పేర్కొంది. ఈ టికెట్లను తమ అధికారిక వెబ్‌సైట్ http://tgsrtcbus.in ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.
200 కోట్లకుపైగా..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కింద.. ఇప్పటివరకు మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ 200 కోట్లకుపైగా జీరో టిక్కెట్లను విక్రయించింది. కాగా, మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద మహిళలు, ట్రాన్స్‌జెండర్లు రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర ప్రభుత్వ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, గ్రామీణ ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు.


