దేవాదాయ భూములు అన్యక్రాంతం కాకుండా ప్రతి ఒక్కరు కాపాడాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పొల్యూషన్ బోర్డు మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్‌లు అన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి కిలోమీటరు దూరంలో దక్షిణ బాగాన వెలిసిన 400ఎండ్ల చరిత్ర గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం మహోత్సవం ఆలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,పొల్యూషన్ బోర్డ్ మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్, ఇన్‌స్పెక్టర్ ప్రణీత్ కుమార్, ఈఓ స్నేహాలతలు హాజరయ్యారు. దేవాలయ నూతన పాలకమండలి చైర్మన్‌గా జిల్లెల్ల పవన్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా కాకి అమృత పాలకమండలి సభ్యులుగా ముక్తాల స్వామి గౌడ్, తిక్కల యాదయ్య, దానగల్ల వెంకటయ్య, దుర్గపురం జంగయ్య, గౌరవ సభ్యులుగా అర్చకులు నరసింహాచారిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాంపూర్‌లో ప్రతి ఏటా జరిగే శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూపకలప్పన చేయాలని నూతన పాలకమండలి సభ్యలకు సూచించారు. గతంలో మాదిరి కాకుండా దేవాలయ అభివృద్దికి పాటుపడాలని తెలిపారు. పదవి ఆకాంక్షతో కాకుండా దేవునికి సేవచేయాలనే దృక్పదంతో ఉండాలని కోరారు. ఆలయ పునర్నిర్మాణానికి ఎండోమెంటులో రూ.10 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే రూ.50 లక్షలు మంజూరు చేయిస్తానని తెలిపారు. గ్రామంలో విద్యార్థుల సౌకర్యార్థం కోసం గ్రంథాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
చైర్మన్ జిల్లెల్ల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ప్రజలందరి సహకారంతో ఆలయ అభివృద్ధి కొరకు పాటుపడతానని అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం కోసం కోనేరును పునర్నిర్మిస్తానని తెలిపారు.