కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయ కోణాలు ఎవ్వరు ఊహించిన రీతిలో ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. నియోజకవర్గ ప్రజలెవ్వరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటుండటం ఇక్కడ ఆసక్తి రేకెత్తిస్తోంది. అతి తక్కువ టైంలో రాజకీయంగా రాణిస్తూ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనే ఎన్నారై ఐక్యత ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచిత సేవలు అందిస్తూ పేదల మన్ననలు పొందారు. తను పుట్టిన కల్వకుర్తి గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికా పౌరసత్వం వదిలేసి కల్వకుర్తి నియోజకవర్గంలో ఐక్యత పౌండేషన్ ద్వారా పేదలకు ఉచితంగా సేవలు అందిస్తూ వచ్చారు.
ఎన్నారై సేవలు..
మండల కేంద్రాలలో ఐక్యత పౌండేషన్ కార్యాలయాలు పెట్టి అక్కడి నుండి పేద ప్రజలకు ఉచిత కోచింగ్, అంబులెన్స్‌లు, పురాతన దేవాలయాల నిర్మాణాలు, పల్లెల్లో సిసి రోడ్లు, యువతకు క్రీడా పోటీలు మొదలుకొని తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందించారు. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి చెల్లా వంశీచంద్ రెడ్డి ఢిల్లీలో ఉన్న ముఖ్య పదవి నేపథ్యంలో కల్వకుర్తి ప్రజలను కాస్త పట్టించుకోకుండా వదిలేశారు. అదే సందర్భంలో ఢిల్లీ పెద్దల సమక్షంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సుంకిరెడ్డికి నిరాశే మిగిలింది. బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపు దిశగా సుంకిరెడ్డి మద్దతు ఇచ్చి గ్రామ గ్రామాన ఎన్నికల నేపథ్యంలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా సుంకిరెడ్డి కృషి చేశారు.
రేవంత్ సభలో ఇచ్చిన హామీ ఏమైంది..
కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి పాఠకులకు విధితమే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిలు హాజరయ్యారు. ఆ నిండు సభలో నేటీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలను గుర్తు చేస్తూ ఆయనకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించి గుర్తింపు ఇస్తామని సభ సాక్షిగా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 5 వేల మెజారిటీతో ఘన విజయం పొందారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన కసిరెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ పదవి ఖాళీ ఏర్పడడంతో సుంకిరెడ్డి అభిమానులు ఎమ్మెల్సీ పదవి సుంకిరెడ్డికి కేటాయించాలన్నా ఆకాంక్షతో ఎన్నో ఆశలతో వేచి చూశారు. తీరా ఎమ్మెల్సీ పదవి కూడా సుంకిరెడ్డికి కేటాయించకుండా నిరాశ మిగిల్చింది.
అసహనంలో ఎమ్మెల్యే..
దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన, నిరాశలో కూరుకుపోయి ఐక్యత ఫౌండేషన్ ద్వారా సేవలు కూడా తగ్గించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కార్పొరేషన్ లో ఏదో ఒకటి పదవి దక్కుతుందనే ఆశతో అభిమానులు మరో ప్రయత్నానికి లేవనెత్తారు. అది కూడా పూర్తిగా విఫలం కావడంతో అభిమానులలో నిరాశ, బాధలు మిగిలాయి. అభిమానులు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టకేలకైనా తీపి కబురు చెబుతారని ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ఎప్పుడెప్పుడు తీపి కబురు చెబుతారా అని అభిమానుల కళ్లు కాయలు కాసేలా ఎదురచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న సుంకిరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు? అసలు సుంకిరెడ్డి దారెటు అనేది స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.