Saturday, July 20, 2024
HomeతెలంగాణThalasani: ఉచితంగా షాపులు కేటాయిస్తాం

Thalasani: ఉచితంగా షాపులు కేటాయిస్తాం

బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఎన్నో సంవత్సరాల నుంచి చిరు వ్యాపారాలు చేసుకొంటూ జీవనం సాగిస్తున్న వారికే నూతనంగా నిర్మించిన షాప్ లను ఎలాంటి అద్దె లేకుండా ఉచితంగానే కేటాయించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ ఈఓ అన్నపూర్ణ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నూతనంగా ఎంపికైన ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద నూతనంగా నిర్మించిన షాప్ లను వచ్చే నెల 4 వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పర్యవేక్షణ నిమిత్తం ఆలయం లోపల, ఆలయ పరిసరాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. ఆలయానికి వచ్చే అన్ని రహదారులను ఎంతో అద్బుతంగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. భక్తులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదని స్పష్టం చేశారు. అమ్మవారి మొక్కులు తీర్చుకొనే క్రమంలో అనేకమంది అమ్మవారికి కోళ్ళు, గొర్రెలు, మేకలను బలి ఇస్తారని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సూచించిన ధరల ప్రకారమే భక్తుల నుండి చార్జీలను వసూలు చేయాలని, అదనంగా వసూలు చేస్తే తక్షణమే వారి కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

నూతన కమిటీ సభ్యులు కూడా ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పర్యవేక్షణ జరపాలని, ఆలయ అభివృద్దికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నూతన కమిటీ సభ్యులు కూతురు నరసింహా, ఉప్పల యాదగిరి, సుబ్బారావు, సుబ్బరాజు, సరాఫ్ సంతోష్, రాజారెడ్డి, గౌతమ్ రెడ్డి, ఆంజనేయులు యాదవ్, ప్రభు గౌడ్, అనీల్ కుమార్, సురేష్ గౌడ్, యాదగిరి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News