అమీర్‌పేట కాలనీలలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పార్క్ లను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన సనత్ నగర్ లో పర్యటించి 3.08 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎస్ ఆర్ టి లో 2 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మించిన నెహ్రూ పార్క్ (మల్టి జనరేషన్ థీమ్ పార్క్) ను ప్రారంభించారు. అదేవిధంగా సుందర్ నగర్ లో రూ. 52.30 లక్షలతో చేపట్ట నున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను, శ్యామలకుంట లోని జగ్జీవన్ రాం విగ్రహం వద్ద రూ. 8.40 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను, అల్లా ఉద్దిన్ కోటిలో 48 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. పార్క్ ను ప్రారంభించిన అనంతరం స్థానికులతో కలిసి మంత్రి పార్క్ మొత్తం కలియతిరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్క్ ను కాలనీ వాసులు సక్రమంగా నిర్వహించుకోవాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోనే అద్బుతమైన పార్క్ ను ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పారు. పార్క్ లో ఎలాంటి ఇతర కార్యకలాపాలకు అవకాశం లేకుండా సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంత అద్బుతమైన పార్క్ ను నిర్మించడం పట్ల మంత్రికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలను తెలుసుకున్న వెంటనే వాటిని పరిష్కరించే నేత తమకు ఉండటం తమ అదృష్టమని పేర్కొన్నారు. అల్లా ఉద్దిన్ కోటి పర్యటన సందర్బంగా స్థానికులు పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. హెవీ వాహనాలు వస్తుండటం వలన తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొనగా, అల్లా ఉద్దిన్ కోటి, లోధా అపార్ట్ మెంట్ పక్క రోడ్ల లో హెవీ వాహనాలు రాకుండా గడ్డర్స్ ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ రవి కిరణ్ ను మంత్రి ఆదేశించారు. తమ బస్తీలో పలు చోట్ల ఇనుప విద్యుత్ స్తంభాలు ఉన్నాయని, వాటిని తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సనత్ నగర్ మెయిన్ రోడ్డు విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆల్విన్ నుండి లోధా అపార్ట్ మెంట్ వరకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ స్తంభాలను వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమస్యలను వెంట వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
మంత్రి వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్,డిసి మోహన్ రెడ్డి, ఈ ఈ ఇందిర, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్, హార్టికల్చర్ డిడి శ్రీనివాస్, స్ట్రీట్ లైట్ డిఈ కిరణ్మయి, ఎలెక్ట్రికల్ ఎడి అమర్నాద్ తదితరులు ఉన్నారు.