పాత బస్తీలోని ప్రముఖ దేవాలయమైన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి ఆలయ అభివృద్ధికి స్థానికులు సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మాసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ విస్తరణ కోసం సేకరించాల్సిన స్థలాల యజమానులు, ఎమ్మెల్యే బలాలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని అద్బుతంగా అభివృద్ధి చేస్తామని సీఎం కెసిఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొన్ని నిర్మాణాలను సేకరించడానికి గుర్తించినట్లు చెప్పారు. సంబంధిత స్థలాల యజమానులకు ప్రభుత్వం తగిన న్యాయం జరిగే విధంగా పరిహారం అందిస్తామన్నారు. అందు కోసం ఇప్పటికే ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. అభివృద్ధి, విస్తరణ పనులకు సహకరించడం ద్వారా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాల సందర్బంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్నారు. ప్రభుత్వం కూడా భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందన్నారు.