తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని రాష్ట్రంలోని దేవాలయాలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించిన విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యారు. గణనాథుడికి ప్రత్యేక పూజలను చేయించారు. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పొందారు. మంత్రి సమక్షంలో నూతన కమిటీ సభ్యులతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ ఆలయాలకు ధూప దీప నైవేద్యం కింద కోట్లాది రూపాయలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది, అర్చకుల సమస్యలను పరిష్కరించిందని వివరించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఎంతో గొప్పగా యాదాద్రి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ చొరవతో అభివృద్ది చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వినోద్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత, నాయకుడు నాగులు తదితరులు పాల్గొన్నారు.