Thalasani comments on BC reservations: తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సమాఖ్యల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లాభాలు పొందాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పెట్టింది బడుగు, బలహీన వర్గాలే” అని గుర్తు చేసిన ఆయన, బీసీల హక్కుల కోసం కొనసాగుతున్న పోరాటాన్ని మరింత బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌పై వ్యాఖ్యానించిన తలసాని, “దీన్ని ఎవరు కోరారు? ఇది సాధ్యం కాదని చెప్పే వారు 125 ఏళ్ల అనుభవమున్న మాతో వాదించడం సమంజసం కాదు” అన్నారు. బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లను కల్పించాలంటే 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాజకీయ డ్రామాలపై విమర్శలు
తాజాగా జారీ చేసిన జీవోలను, ఆర్డినెన్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకువస్తోందని తలసాని విమర్శించారు. “ఇది ఎన్నికల వేళ పన్నిన డ్రామా. న్యాయస్థానం ఇచ్చిన గడువుతో తొందరగా చర్యలు చేపడుతున్నారు. కానీ అసలైన లక్ష్యం మాత్రం బీసీలకు న్యాయం చేయడమే కావాలి” అని పేర్కొన్నారు. “42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేము చూస్తూ ఊరుకోం. ఇది మాలా మాదిగల ఉద్యమంలాగే బీసీల ఉద్యమంగా రూపాంతరం చెందుతుంది. మేము సహనం కోల్పోతే, మీ అధికారమే ప్రమాదంలో పడుతుంది” అని తలసాని హెచ్చరించారు. తదుపరి స్థానిక ఎన్నికలు బీసీలకు తగిన స్థానం కల్పించేలా ఉండాలని, లేదంటే బీసీ సంఘాలు మౌనం విడిచి ఆందోళన చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. “మేము బిచ్చగాళ్లం కాదు, మా న్యాయమైన వాటాను డిమాండ్ చేస్తున్నాం” అని తలసాని జోరుగా ప్రకటించారు.
కాగా ప్రస్తుతం తెలంగాణలో బీసీల విషయంపైనే రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అటు కల్వకుంట్ల కవిత అయినా.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయినా దీనిపైనే ఎక్కువగా రాజకీయాలను చేస్తున్నారు. ఇదే విషయంపై మల్లన్న, కవిత వర్గాల మీద ఘర్షణ చోటు చేసుకోవడం, ఆ తరువాత కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసం మాత్రమే బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందా? ఆ అంశం ఆధారంగా రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో మాత్రం వచ్చే ఎన్నికలైనా.. లేదా అతి త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలయిన కచ్చితంగా బీసీ అంశంపై వెళ్తుందని తెలుస్తోంది.


