రాజద్రోహ చట్టం రూపంలోకి తీసుకు రావాలని, దాన్ని మరిన్ని కోరలు పెట్టి దండనీయం నేరంగా కఠిన శిక్షలు అమలు చేయాలని లా కమీషన్ చేసిన సిఫారసులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఖమ్మంలోని స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం ఖమ్మం జిల్లా కమిటి సమావేశం పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రభుత్వ ఆలోచనలతో విభేదించడాన్ని రాజద్రోహంగా పరిగణించడమనే సాంప్రదాయం మధ్య యుగాల నాటి క్రూరమైన అణచివేతకు చిహ్నమని తమ్మినేని విమర్శించారు. 22వ, లా కమీషన్ సిఫారసు చేసిన సెడిషన్ చట్టాన్ని దండకార్యమైన జాబితాలో లేకుండా చూడాలని, పూర్తిగా యీ చట్టాన్ని రద్దు చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. ఐ.పి.సి.లోని 124 ఎ సెక్షన్ రద్దు చేస్తూ గత ఏడాది యిచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. లా కమీషన్ చేసిన ఈ సిఫార్సులను సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైనవని విమర్శించారు. బ్రిటిష్ వలస పాలకులు భారతీయులను అణచివేయడం కోసం, వారి ప్రజాస్వామ్య ఆకాంక్షలను అణగద్రొక్కడం కోసం తెచ్చిన రాజద్రోహ చట్టాన్ని లా కమీషన్ ఏ విధంగా సమర్థిస్తుందని తమ్మినేని నిలదీశారు. భారతదేశం స్వాతంత్య్రం సంపాదించుకున్న తర్వాత స్వతంత్ర రాజ్యాంగం రూపొందించుకున్న తర్వాత ఏ విధంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి లా కమీషన్ సిఫారసు చేసిందని విమర్శించారు. భారత రాజ్యాంగంలో వున్న 19వ అధికరణ ప్రకారం దేశ ప్రజలకు సంక్రమించిన వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కులకు వున్న హామీలను ఈ విధమైన సిఫార్సులు హరించి వేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు కూడా ఈ 124 ఎ నిబంధనను తీవ్రంగా వ్యతిరేకించిందని, ఈ నేపథ్యంలో పూర్తిగా రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలని తమ్మినేని పునరుద్ఘాటించారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు మాట్లాడుతూ ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించాలని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలగచేసిందన్నారు. ఇటీవల భారత రైల్వేలో కవచ్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలను అరికట్టనున్నాయని ఘనంగా ప్రకటించిన మోడీ యిప్పుడు ఈ ప్రమాదానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కవచ్‌కు సంబంధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే స్టేషన్లు, రైల్వేలలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పెరిగితే యిటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని, ప్రైవేటు వ్యక్తులు ఆర్థిక విషయాలతో ముడిపెట్టి ఉద్యోగుల సంఖ్యను క్రమేపీ తగ్గించడంతో పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి తగ్గుతుందని, దాంతోపాటు నిరంతరం పర్యవేక్షణ కరువౌతుందని తెలిపారు. దశాబ్ద కాలంలో యింతటి ఘోర ప్రమాదం జరగలేదని అన్నారు. రైల్వే శాఖ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వందలమంది ప్రాణాలను బలిగొందన్నారు. వందలమందితో చేయాల్సిన పనిని పదుల సంఖ్యతో చేయించడం వల్లే యిటువంటి ప్రమాదాలు జరుగుతాయని, యిప్పటికైనా రైల్వే ప్రైవేటీకరణను కేంద్రం నిలుపుదల చేయాలని, దీన్ని ఒక హెచ్చరికలా భావించాలని సూచించారు. మృతి చెందిన వారికి కోటి రూపాయలు, గాయపడిన వారికి 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా యివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం, బండి రమేష్, చింతలచెర్వు కోటేశ్వరరావు తదితరులతో పాటు పార్టీ జిల్లా కమిటి సభ్యులు పాల్గొన్నారు.
Thammineni: రాజద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి
రాజద్రోహమనే సాంప్రదాయం మధ్య యుగాల నాటి క్రూరమైన అణచివేతకు చిహ్నం