Heart Attack : గుండె పోటు కేసులు ఆందోళన కలిగిస్తోంది. గతంలో పెద్దవారిని మాత్రమే ప్రభావితం చేసే గుండెపోటు, ఇప్పుడు చిన్న వయస్సు వారిని కూడా బలిగొంటోంది. ఈ ఆకస్మిక మరణాలు, ముఖ్యంగా యువతలో, సమాజంలో భయాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు విషాదకర సంఘటనలు ఈ పరిస్థితికి నిదర్శనం.
నారాయణపేట జిల్లాలో వినాయక నిమజ్జనంలో డీజే మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తూ శేఖర్ అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడికి సీపీఆర్ చేసినప్పటికీ, ప్రాణాలు దక్కలేదు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే, హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ డేవిడ్ (31) వినాయక నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించలేదు. డేవిడ్‌కు భార్య, మూడు నెలల పాప ఉన్నారు.
యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆధునిక జీవనశైలి, అధిక ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యం సేవించడం వంటివి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అంతేకాకుండా, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలు.
ఈ ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధూమపానం, మద్యం మానుకోవడం వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి తోడ్పడతాయి. గుండె జబ్బుల లక్షణాలు తెలిసినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. యువతలో పెరుగుతున్న ఈ గుండెపోటు కేసులపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.


