తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగుల స్వయంఉపాధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈనెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మొత్తం రెండు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుకు ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు ఉంది.
దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తరువాత ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు వాటిని పరిశీలిస్తారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు అర్హుల జాబితాను జిల్లా స్థాయి కమిటీలకు అందజేస్తాయి. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే21 నుంచి 31వ తేదీ వరకు యూనిట్లను మంజూరు చేస్తుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం చెక్కుల పంపిణీని ప్రారంభించనుంది.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గైడ్ లైన్స్ ఇవే.
♦ వ్యవసాయేతర పథకాలకు లబ్ధిదారుల వయసు 2025 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
♦ వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు వయసు 21 నుంచి 60ఏళ్ల మధ్య ఉండాలి.
♦ దరఖాస్తుదారులు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా వివిధ స్థాయిలో సబ్సిడీ ఉంటుంది.
♦ రూ.50వేల యూనిట్లకు 100శాతం సబ్సిడీ
♦ రూ.50వేల నుంచి రూ. లక్ష మధ్య ఉన్న యూనిట్లకు 90శాతం సబ్సిడీ
♦ రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకు యూనిట్లకు 80శాతం సబ్సిడీ
♦ రూ. 2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70శాతం సబ్సిడీ
♦ సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు.
♦ కుటుంబంలో ఒక్కరికే మాత్రమే ఈ పథకం వర్తింపు