Saturday, November 23, 2024
HomeతెలంగాణThimmapur: వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సీఎం దంపతులు

Thimmapur: వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సీఎం దంపతులు

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బిర్కూర్ మండలం తిమ్మాపూర్ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సతీసమేతంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి హెలిక్యాప్టర్ లో బాన్సువాడ పర్యటించారు. సీఎం కేసీఆర్, శోభతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బి.బి.పాటిల్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

2 కిలోల స్వర్ణ కిరీటం

దేవాలయ అభివృద్ధికి సంబంధించిన పైలాన్ ను సీఎం ఆవిష్కరించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం చేయించిన రెండు కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి సీఎం కేసీఆర్ దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను పోచారం దంపతులు పట్టువస్త్రాలతో సన్మానించారు. ఆలయ ప్రాంగణంలో సిఎం మొక్క నాటారు. దైవ దర్శనం అనంతరం
అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొ న్నారు. తర్వాత అక్కడే స్పీకర్ ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన ఆతిథ్యాన్ని స్వీకరించారు. స్పీకర్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లారు. అక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రజలను కలిశారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి చేరుకున్నారు.
చచ్చిపోయాక బిర్యానీ పెడితే లాభమేంది?
బాన్సువాడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం ఆద్యంతం సభికులను ఆకట్టుకుంది. తెలంగాణ ఉద్యమానికి ముందు, తరువాతి సమయంలో జరిగిన పలు విషయాలను ఆయన గుర్తు చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించటం విశేషం. పోచారం కోరుకున్న దాని కంటే గొప్పగా ఈ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నదని సీఎం కితాబిచ్చారు. భగవంతుడు ఆయన సేవ మనతో చేయించుకుంటాడని.. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోసెస్ అని చెప్పినట్లు భగవంతునికి శ్రీనివాస్ రెడ్డి గారి మీద, బాన్సువాడ మీద దయ కలిగింది కాబట్టీ నన్ను కూడా పిలుపించుకొని ఆయన సేవ ఆయనే చేయించుకున్నాడని మనం చేసింది ఏమీ లేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ పుణ్య క్షేత్రం అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తక్షణం 7 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడానికి తనను ప్రేరేపించిన కారణాల్లో సింగూరు ప్రాజెక్టు కూడా ఒక ప్రబలమైన కారణమని, దీని కోసం పోచారం అనేకసార్లు దీక్షలు చేశారని గుర్తు చేశారు. “నాడు బోధన సబ్ కలెక్టర్ గా ఉన్న నేటి ఫైనాన్స్ కార్యదర్శి రామకృష్ణా రావు బాన్సువాడ మీదుగా పోతుంటే బతికున్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చి, గంజి పోసైనా సరే బతికియ్యండి గానీ చచ్చిపోయాక మీరు బిర్యానీ పెట్టి లాభమేందని నాడు పోచారం అన్న మాటలను రామకృష్ణారావు నేటికీ గుర్తు చేస్తార”ని కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. వయసును దృష్టిలో పెట్టుకోకుండా పోచారం నిరంతరం ప్రజాసేవ చేయాలని కేసీఆర్ కోరారు. బాన్సువాడ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి 7 కోట్లు, సీఎం డెవలప్మెంట్ ఫండ్ నుంచి 50 కోట్లను సీఎం మంజూరు చేయటం మరో హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News