Friday, November 22, 2024
HomeతెలంగాణThorruru: ఫాం ల్యాండ్ పేరుతో ఘరానా మోసం

Thorruru: ఫాం ల్యాండ్ పేరుతో ఘరానా మోసం

భవిష్యత్ లో కొనుగోలుదారులకు తప్పని తిప్పలు

ఇల్లు క‌ట్టుకోవాల‌నే సామాన్యుల‌ను ఆకాంక్ష‌ల‌ను ఆస‌రాగా చేసుకుంటున్న రియ‌ల్ట‌ర్లు నిండా ముంచేస్తున్నారు. ఎలాంటి అనుమ‌తుల్లేని పొలం భూముల‌ను ప్లాట్లుగా అమ్ముతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామ రెవెన్యూ ఆర్&బి కాలని గ్రామ పరిధిలో కొోకొల్ల‌లుగా నాన్ లే అవుట్ వెంచ‌ర్లుగా వెలుస్తున్నాయి. తాజాగా రాయపర్తి మండ‌ల కేంద్రానికి అత్యంత చేరువ‌లో ఉన్న ఆర్ &బి గ్రామ ప‌రిధిలో ఓ భారీ నాన్ లే అవుట్ వెలిసింది.మొరిపిరాల గ్రామ రెవెన్యూ ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 195లో సుమారు ఎనిమిది ఎక‌రాల స్థ‌లంలో నాన్ లేఅవుట్ వెంచ‌ర్ చేశారు. రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామం వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారికి చేరువలో ఉన్న ఈ వెంచ‌ర్‌లో కోన్ని రోజుల క్రితం నుంచి అమ్మ‌కాలు మొద‌లైంద‌ని స‌మాచారం. ఫాం ల్యాండ్ కింద రిజిస్ట్రేష‌న్లు సాగిస్తూ ప్లాట్ల‌ను విక్ర‌యిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఎలాంటి అనుమ‌తుల్లేకుండా సాగుతున్న‌ ఈ అక్ర‌మ దందాను అడ్డుకోవాల్సిన ఎంపీడీవో, గ‌ప్‌చుప్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం అనుమానాల‌కు తావిస్తోంది.

- Advertisement -

వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి కొనుగోలుదారులకు వ‌ల‌:

ఎనిమిది ఎక‌రాల భూమిని ఫాం ల్యాండ్ వెంచ‌ర్‌గా ఏర్పాటు చేసిన నిర్వాహకులు 30 ఫీట్ల రోడ్డు వేస్తున్న‌ట్లుగా ఓ కాగితంపై ప్లాను గీసి చూపిస్తున్నారు.వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఉండ‌టంతో నిర్వాహాకులు భారీ డిమాండ్‌తో ప్లాట్ల‌ను అంట‌గ‌డుతున్నారు. గ‌జం రూ.6వేల నుంచి రూ.8వేల వ‌ర‌కు అమ్మ‌కాలు సాగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. లే అవుట్ ప‌ర్మిష‌న్లు లేని భూముల్లో ఇళ్ల నిర్మాణాల‌కు అనుమ‌తులు ల‌భించ‌డం లేదు. దీంతో పొలం భూముల‌ను ప్లాట్లుగా భావించి కొనుగోలు చేసిన వారు ఇప్ప‌టికే నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆర్&బి గ్రామ శివారులో వెలిసిన వెంచ‌ర్‌లో 100 పై చిలుకు ప్లాట్లు చేసి అమ్మ‌కానికి పెట్టి కొనుగోలుదారుల‌కు వ‌ల వేస్తున్నారు.

కొనుగోలు చేస్తే అంతే భవిష్యత్తు లో తప్పని తిప్పలు:

ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటవుతున్న వెంచర్ల కారణంగా ప్లాట్ల కొనుగోలుదారులు నిలువునా మునిగిపోతున్నారు. లే అవుట్‌ లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే నిబంధనల మేరకు రోడ్లు ఉండని కారణంగా సొంతంగా స్థలం వదిలేసుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు వెంచర్లలోని రోడ్లు 40 ఫీట్ల వెడల్పు ఉండాలి. అంతకు తక్కువ వెడల్పు ఉన్న పక్షంలో నిర్ణీత వెడల్పునకు సరిపడా స్థలాన్ని ప్లాటులో నుంచి జిపి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇంటి నిర్మాణానికి అనుమతులు లభిస్తాయి. ఒకవేళ 40 ఫీట్ల వెడల్పు గలిగిన రోడ్లు ఉన్నప్పటికీ లేఅవుట్‌ అనుమతులు లేని కారణంగా ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు కావు. దీంతో ఇల్లు నిర్మాణానికి అనేక ఆటంకాలు ఏర్పడుతాయి. లే అవుట్‌ లేని ప్లాట్లలో ఇల్లు నిర్మించదలిస్తే ముందుగా లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ప్లాటు యజమానే భరించాల్సి ఉంటుంది.

వెంచర్ కు ఉండాల్సిన నియమనిబంధనలు ఇవి:

ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారీతిన వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. వెంచర్లు ఏర్పాటు చేసే స్థలంలో యజమానులు 40 ఫీట్ల వెడల్పు రోడ్లను నిర్మించాలి. రోడ్ల చివర్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను సిమెంట్‌, కాంక్రీటుతో నిర్మించాలి. కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి, విద్యుత్‌ కనెక్షన్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకొనే ప్రజలకు ఆహ్లాదం కోసం డీటీసీపీ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి పార్కుకు స్థ‌లం వ‌ద‌లాలి. అందులో సొంత ఖర్చులతో మొక్కలు నాటి అభివృద్ధి చేయాలి. దీని కోసం స్థానిక సంస్థలకు 10 శాతం స్థలం వెంచర్‌ యజమాని అప్ప‌గించాల్సి ఉంటుంది. సదరు స్థలాన్ని గ్రామ పంచాయతీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాలి. ఈ ఏర్పాట్లు అన్ని చేశాక లే అవుట్‌ అనుమతులకు దరఖాస్తు చేయాలి. అధికారులు నిబంధనల మేరకు అభివృద్ధి జరిగిన పక్షంలో లే అవుట్‌ అనుమతులు మంజూరు చేస్తారు. లే అవుట్‌ అనుమతులకు నిర్ణీత ఫీజును ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రస్తుతం ఆర్&బి కాలని శివారులో వెలిసిన వెంచర్‌లో ఎక్కడా పై నిబంధనలు అమలు కావడం లేదు. సామాన్యుల‌కు ఆర్థిక భారాలు క‌ల‌గ‌డంతో పాటు ప్రభుత్వ ఆదాయానికీ గండి ప‌డుతోంది.

పంచాయతీ కార్యదర్శి (వీరేందర్)
తెలుగుప్రభ రిపోర్టర్ స్థానిక పంచాయతీ కార్యదర్శిని మొబైల్ లో వివరణ కోరగా వెంచర్ నిర్వాహకులకు నోటీసు మూడు సార్లు గతంలో జారీ చేశామని చెప్పారు. వెంచర్ ఉన్న ప్రదేశంలో నోటిస్ బోర్డు ఏర్పాటు చేస్తే వెంచర్ నిర్వాహకులు తొలగించారని వారికి ఎన్ని సార్లు వినడం లేదని చేప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News