హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు కచ్చితంగా పర్యటించే ప్రాంతాల్లో నెహ్రు జూపార్క్(Nehru Zoo Park) ఒకటి. రకరకాల పక్షులు, జంతువులను చూసిన ట్రైన్ రైడ్ ఎంజాయ్ చేసేందుకు జనం వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పర్యాటలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జూ పార్క్ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీలో చర్చించి ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని జూపార్క్ క్యూరేటర్ వసంత ఓ ప్రకటనలో తెలిపారు.
మార్చి 1 నుంచి ఎంట్రీ టికెట్ పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు చేయనున్నారు. గతంలో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.45గా ఉండేది. ఇక ఫోటో కెమెరా అనుమతికి రూ.150, వీడియో కెమెరా (ప్రొఫెషనల్)కు రూ.2500 రూపాయలు, కమర్షియల్ మూవీ షూటింగ్ కోసం రూ.10వేలు ఛార్జి చేస్తారు. అలాగే అన్ని రోజుల్లో 20 నిమిషాల ట్రైన్ రైడ్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40లుగా నిర్ణయించారు. బ్యాటరీ ఆపరేటెడ్ అయితే పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70 చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రకటించారు.
