Tipper owner respond on Chevella accident: చేవెళ్ల ప్రమాదానికి కారణం మా డ్రైవర్ కాదని టిప్పర్ యజమాని లక్ష్మణ్ నాయక్ అన్నారు. బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ గుంతను తప్పించబోయి మాపైకి దూసుకొచ్చాడని చెప్పారు. వెంటనే డ్రైవర్ ఆకాశ్ నన్ను నిద్రలో నుంచి లేపాడని తెలిపారు. సైడ్‌కు తీసుకోమని మా డ్రైవర్‌కు చెప్తుండగానే.. ఆర్టీసి బస్సు మాపైకి దూసుకొచ్చిందని అన్నారు. దీంతో ప్రమాదం జరిగందని తెలిపారు. మా డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టిప్పర్ యజమాని లక్ష్మణ్ నాయక్ అన్నారు.
కంకర లారీ రూపంలో కబళించింన మృత్యువు: చేవెళ్ల బస్సు ఘటనలో మృత్యువు కంకర లారీ రూపంలో కబళించింది. నెలలు నిండని పసిగుడ్డుతో పాటు మొత్తం 19 మందిని పొట్టనపెట్టుకుంది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. 19 మంది మృతుల్లో 13 మంది తాండూరుకు చెందినవారే ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం తల్లడిల్లుతోంది. ఈ ప్రమాదం వెనక కారణాలపై పోలీసు, రవాణా శాఖల అధికారుల దర్యాప్తు మొదలైంది. టిప్పర్ డ్రైవర్ గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది మరణించినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే బస్సును ఢీకొట్టడానికి ముందు టిప్పర్ డ్రైవర్ బ్రేకు వినియోగించకపోవడం వల్లే ఇది జరిగి ఉండొచ్చని ట్రాఫిక్ పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. టిప్పర్‌లో పరిమితికి మించి కంకర లోడు, అతివేగంతో ఉండటం వల్ల ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో అదుపుతప్పి నియంత్రణ కోల్పోయినట్లు అంచనావేస్తున్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/chevella-bus-incident-updates/
పోలీసుల కీలక నిర్ణయం: రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై వచ్చేనెల నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిందన్నారు. రోడ్డు పరిస్థితిని బట్టి స్పీడ్ నియంత్రణ ఉండాలని తెలిపారు. ఈ ప్రమాదంపై పుర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓఆర్ఆర్, నేషనల్ హైవేలపై హైస్పీడ్‌కు అనుమతి ఉందని.. అక్కడ వాహనాలు నడిపిన డ్రైవర్లు సాధారణ రోడ్లపై సైతం అదే స్పీడ్‌తో వెళ్లడం ఇది సరైనది కాదన్నారు. వాహనదారుల అతివిశ్వాసం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.


