Saturday, November 15, 2025
HomeతెలంగాణTipper Terror: టిప్పర్ల ప్రళయం.. రోడ్లపై యమపాశాలు! ప్రాణాలు తోడేస్తున్న 'ఓవర్‌లోడ్' భూతం!

Tipper Terror: టిప్పర్ల ప్రళయం.. రోడ్లపై యమపాశాలు! ప్రాణాలు తోడేస్తున్న ‘ఓవర్‌లోడ్’ భూతం!

Overloaded Tipper Accidents : రయ్ మంటూ దూసుకొచ్చే ఓ టిప్పర్.. వెనుకనే పొంచి ఉన్న ఓ మృత్యుశకటం! చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదం దీనికి నిలువెత్తు సాక్ష్యం. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇది నిత్యకృత్యం. రోడ్లపై తిరిగే ఈ ‘యమపాశాలు’ ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. అసలు ఈ టిప్పర్ల టెర్రర్‌కు అడ్డేలేదా? అధిక లోడు అనే భూతాన్ని అరికట్టేదెవరు? మన రోడ్లు ఎప్పటికి సురక్షితంగా మారతాయి? ఈ రాకాసి లారీల వెనుక ఉన్న కఠోర వాస్తవాలపై ప్రత్యేక కథనం.

- Advertisement -

నెత్తురోడుతున్న రహదారులు : ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ఇసుక రీచ్‌లు, బొగ్గు గనులు, కంకర క్వారీల నుంచి వేలాది టిప్పర్లు, భారీ లారీలు నిత్యం ముడిసరకులను తరలిస్తుంటాయి. అయితే, నిబంధనలను తుంగలో తొక్కి, పరిమితికి మించి లోడు వేయడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద కంకర టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోవడం దీనికి పరాకాష్ట. అధిక లోడు కారణంగా ప్రమాద తీవ్రత పెరిగి, మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

కనిపించని క్షోభ.. కన్నీటి గాథలు : ప్రతి ప్రమాదం వెనుక ఎన్నో కుటుంబాల భవిష్యత్తు ఛిద్రమవుతోంది. ఇలాంటి ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి.

రెండేళ్ల క్రితం: చుంచుపల్లి మండలం వద్ద అతివేగంగా వచ్చిన బొగ్గు లారీ, 47 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కొన్నాళ్ల క్రితం: కొత్తగూడెం అండర్ బ్రిడ్జ్ వద్ద ఫ్లై యాష్ ట్యాంకర్ అదుపుతప్పి ద్విచక్ర వాహనంపై పడటంతో, రోడ్డు పక్కన జొన్నరొట్టెలు అమ్ముకుని జీవించే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

అధిక లోడుతో పొంచి ఉన్న ప్రమాదాలు : అధిక లోడు కేవలం ప్రాణాలనే కాదు, మన రోడ్లనూ బలి తీసుకుంటోంది.
నియంత్రణ అసాధ్యం: అధిక బరువున్న వాహనాన్ని అతివేగంలో నియంత్రించడం డ్రైవర్లకు కత్తిమీద సాము. బ్రేకులు విఫలమవడం, మలుపుల వద్ద బోల్తా పడటం సర్వసాధారణం.
తీవ్ర నష్టం: ప్రమాదం జరిగినప్పుడు టిప్పర్‌లోని కంకర, ఇసుక వంటివి ఇతర వాహనాలపై, ప్రయాణికులపై పడటంతో గాయాల తీవ్రత, మృతుల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతోంది.
రోడ్ల ధ్వంసం: పరిమితికి మించిన బరువుతో వాహనాలు తిరగడం వల్ల రోడ్లు త్వరగా దెబ్బతిని, గుంతలమయంగా మారుతున్నాయి. ఈ గుంతలు ద్విచక్ర వాహనదారుల పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్నాయి.

ఇప్పటికైనా మేల్కొందామా : ఈ ‘టిప్పర్ టెర్రర్’కు అడ్డుకట్ట వేయాలంటే అధికారులు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలి: జిల్లా సరిహద్దుల్లో ధర్మకాంటాలు ఏర్పాటు చేసి ప్రతి లారీ బరువును తనిఖీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన లారీలను సీజ్ చేసి, భారీ జరిమానాలు విధించాలి. రాత్రిపూట పోలీసు, రవాణా శాఖలు సంయుక్త తనిఖీలు కట్టుదిట్టం చేయాలి. మద్యం తాగి, నిర్లక్ష్యంగా నడిపే డ్రైవర్ల లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేయాలి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad