BC JAC state bandh: రిజర్వేషన్లలో మా వాటా మాకు కావాలంటూ.. నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు బీసీ ఐకాస పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాలని కోరింది. ఈ బంద్‌కు రాష్ట్రంలోని అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలన్నీ.. మద్దతు తెలపాయి. అంతే కాకుండా ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు సైతం తమ మద్దతును ప్రకటించాయి. ఆర్టీసీ, దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాలవారంతా బంద్‌లో పాల్గొని మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది. బీసీల ఆకాంక్ష దిల్లీకి వినిపించేలా బంద్ నిర్వహిస్తామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేయాలని సూచించారు. దీంతో పలు విద్యాసంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి.
బంద్‌కు కారణాలు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ దిశగా కుల సర్వే నిర్వహించి.. అసెంబ్లీలో చట్టాలు చేసి కేంద్రానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్డినెన్స్ జారీ చేశారు. దాన్ని గవర్నర్ ఆమోదించకపోవడంతో రేవంత్ సర్కార్ చివరి అస్త్రంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9ను జారీ చేశారు. అయితే హైకోర్టు ఆ జీవోపై స్టే ఇచ్చింది. దీంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇక చేసేది ఏం లేక నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు బీసీ ఐకాస పిలుపునిచ్చింది. ప్రజాజీవనాన్ని స్తంభింపజేసి బీసీల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకే రాష్ట్రబంద్ నిర్వహిస్తున్నట్టు జేఏసీ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్యతో పాటుగా వర్కింగ్ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. అయితే నేటి బంద్‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటుగా బీజేపీ సైతం మద్దతు ఇచ్చాయి.
Also Read:https://teluguprabha.net/telangana-news/hyderabad-book-clubs-reading-culture-revival/
ఏకతాటిపైకి బీసీలు: తెలంగాణలోని బీసీ సంఘాలతో పాటు మేధావులు అందరు ఏకతాటిపైకి వచ్చారు. బీసీలకు కేవలం స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్లు కావాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈనెల 12వ తేదీన బీసీ జేఏసీ ఏర్పాటైంది. ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు సైతం బీసీ రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు తెలిపాయి.


