CM Revanth Reddy Hanmakonda tour: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హన్మకొండకు వెళ్లనున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి సంస్మరణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దొంతి మాధవరెడ్డిని పరామర్శించేందుకు సీఎం మధ్యాహ్నం 1:15 గంటలకు హన్మకొండకు చేరుకుంటారు. కలెక్టరేట్ చేరుకున్న సీఎంకు అధికారులు స్వాగతం చెబుతారు. అక్కడి నుంచి నేరుగా వడ్డేపల్లిలోని ఫంక్షన్ హాల్‌కు చేరుకోనున్నారు. అక్కడ దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం సమర్పించనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హన్మకొండకు వెళ్లనున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వరంగల్ చేరుకున్నారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న పార్టీ అంతర్గత విభేదాల గురించి.. హెలీప్యాడ్ వద్ద సీఎంను కొంతమంది కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. సీఎం జిల్లా పర్యటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. కాగా.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఈ నెల 4వ తేదీన మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇప్పటికే సీతక్కలాంటి పలువురు నేతలు దొంతి మాధవరెడ్డిని పరామర్శించారు.


