CM KCR Mahabubnagar Tour: నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గోని ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా.. పట్టణ శివారులోని పాలకొండ వద్ద 22 ఎకరాల్లో రూ. 55.20 కోట్లతో నిర్మించిన కొత్త కలెక్టరేట్ ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి కొద్దిసేపు పార్టీ శ్రేణులతో మాట్లాడతారు.
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 4గంటల సమయంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు సుమారు 1.50లక్షల మందిని తరలించేలా తెరాస నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి 90వేల మందిని తరలించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల నుంచి మరో 60వేల మంది ఈ సభకు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. బహిరంగ సభను విజయవంతం చేసి తెరాస సత్తా మరోసారి చాటాలని పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నేతలను ముందస్తు అరెస్టులు చేసి ఆయా స్టేషన్లకు తరలించారు. కేసీఆర్ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీసు యంత్రాగం చర్యలు చేపట్టింది.
కేసీఆర్ పర్యటన ఇలా ..
- సీఎం కేసీఆర్ ఉదయం 11గంటలకు ప్రగతి భవన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు బయలుదేరుతారు.
- మధ్యాహ్నం 12.45 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుంటారు. అనంతరం టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారు.
- మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్త కలెక్టరేట్ ప్రాంగణం ప్రారంభిస్తారు.
- 2గంటలకు భోజన విరామం
- సాయంత్రం 4గంటలకు ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు చేరుకొని అక్కడ జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.
- సాయంత్రం 5.10 గంటలకు హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు.