Cine Karmikula Sabha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల తరపున భారీ అభినందన సభను నేడు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ సభ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సభను సినీ పరిశ్రమ పెద్దలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
సినిమా షూటింగ్‌లు రద్దు: సీఎం రేవంత్ రెడ్డితో సభ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరగాల్సిన అన్ని సినిమా షూటింగ్‌లను రద్దు చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ సభ కీలకమైనదిగా సినీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు చేస్తున్న సన్మాన సభ కావడంతో అన్ని యూనియన్లలోని సభ్యులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఉండి అభినందన సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/parents-sale-a-girl-childin-nalgonda-district-telangana/
ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ సైతం విడుదలైంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 9వ వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31న సాయంత్రం 7 గంటలకు వెంగళరావునగర్, సాయంత్రం 8 గంటలకు సోమాజిగూడలో సీఎం ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బోరబండ, సాయంత్రం 8 గంటలకు ఎర్రగడ్డలో రేవంత్ రెడ్డి ప్రచార సభ ఉంటుంది. నవంబర్ 5న యూసుఫ్‌గూడలో ప్రచారం చేయనున్నారు. నవంబర్ 8న నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిల్ ర్యాలీ ఉండనుంది.


