Saturday, November 15, 2025
HomeTop StoriesBC reservations: బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ.. నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు!

BC reservations: బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ.. నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు!

BC reservations in High Court: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్న దృఢ నిశ్చయంతో ఉన్న రేవంత్ సర్కార్ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసింది. అయితే మరోవైపు ఈ రిజర్వేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఉత్తర్వుల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ప్రభుత్వం తరపున వాదించనున్న అభిషేక్ మను సింఘ్వీ: హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో మంగళవారం సాయంత్రం.. సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే సైతం హాజరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Also Read: https://teluguprabha.net/telangana-news/today-important-congress-meeting-by-cm-revanth-reddy/

పెద్ద సంఖ్యలో ఇంప్లీడ్ పిటిషన్లు: ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాలు చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్‌లు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ సోమ, మంగళవారాల్లో ఇంప్లీడ్ పిటిషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. మంగళవారం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ ఆర్. కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.

సరిగ్గా 50 శాతానికి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డితోపాటుగా సముద్రాల రమేష్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే నిబంధనను ఉల్లంఘించేలా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిందని వారు ఆరోపించారు. ప్రస్తుతం బీసీలకు 26 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మొత్తం 50 శాతానికి సరిగ్గా సరిపోతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయితే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని అన్నారు. ఇది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఇతర వర్గాల అభ్యర్థుల హక్కులకు భంగం కలిగిస్తుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల.. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల ఉద్దేశం పూర్తిగా మారిపోతుందని పిటిషనర్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad