Saturday, November 15, 2025
HomeతెలంగాణLocal body elections: మోగిన ఎన్నికల నగారా.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ!

Local body elections: మోగిన ఎన్నికల నగారా.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ!

BC reservation issue in High Court: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడత జరిగే మండల, జిల్లా ప్రజా పరిషత్‌ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. దీంతో స్థానికనేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు 2.15 గంటలకు విచారణను ప్రారంభించనుంది. అయితే బుధవారం జరిగిన వాదనల్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీపై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో నేడు నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అయినప్పటికీ నేడు ఎలాంటి తీర్పు వస్తుందో అని.. యావత్ తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

వాడివేడిగా వాదనలు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ జారీపై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఎంపీ ఆర్‌. కృష్ణయ్య, వి. హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ 50 శాతం పరిమితిని మించకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గుర్తు చేశారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/today-local-body-elections-notifications-in-telangana/

పిటిషనర్ల తరపు వాదనలు: జీవో నంబర్ 9 ప్రకారం అమలు జరపబోయే 42 శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలను ప్రభుత్వం చూపలేదని పిటిషనర్ ల తరపు న్యాయవాదులు వాదించారు. బీసీ కుల గణన చేసినప్పటికీ.. ఆ నివేదికను రేవంత ప్రభుత్వం బహిర్గతం చేయలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు కులగణన ఆధారం అని చెబుతూనే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను ఇదే హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని వారు ప్రస్తావించారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదు.. కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వం తరఫున వాదనలు: రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని అన్నారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలిపిన అంశాన్ని గుర్తు చేశారు. జీవో నంబర్‌ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. బీసీ ప్రత్యేక (డెడికేటెడ్‌) కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచవచ్చని వాదించారు. శాసనవ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. చట్టాలు చేసే అధికారంతో పాటు వాటిని సవరించే నిర్ణయం శాసనవ్యవస్థదేనని స్పష్టం చేశారు.

ఆర్టికల్‌ 200 దుర్వినియోగం: చట్టాల ఆమోదం విషయంలో గవర్నర్లు ఆర్టికల్‌ 200ను దుర్వినియోగం చేస్తున్నారన్న అంశాన్ని సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టసభలు చేసిన చట్టాలను గవర్నర్లు నెలలపాటు ఆమోదించకుండా, తిరస్కరించకుండా ‘త్రిశంకు స్వర్గంలో’ ఉంచడం వల్ల వ్యవస్థ స్తంభించిపోతోందని తెలిపారు. అందుకు తమిళనాడును ఉదాహరణను ప్రస్తావించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్‌ ఇలాగే వ్యవహరించారని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైందని.. ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులు ఉన్నాయని చెబుతూ నోటిఫికేషన్‌ను కోర్టుకు సమర్పించారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాల హైకోర్టును కోరారు. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తామని సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో షెడ్యూల్ ప్రకారం నేడు నోటిఫికేషన్‌ వెలువడనుంది. అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ల అంశంపై నేడు ఎలాంటి తీర్పు వస్తుందో అని.. యావత్ తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad