Saturday, November 15, 2025
HomeతెలంగాణHigh Court: గ్రూప్-1 పై నేడు హైకోర్టులో విచారణ.. ఉత్కంఠకు తెర పడేనా?

High Court: గ్రూప్-1 పై నేడు హైకోర్టులో విచారణ.. ఉత్కంఠకు తెర పడేనా?

Group-1 issue in High Court: రాష్ట్రంలో పుష్కర కాలం తర్వాత వెలువడిన గ్రూప్ 1 నియామకాలపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. ఎంపికకాని అభ్యర్థులతో పాటుగా ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగుల పరిస్థితి.. త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ఉంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ప్రకారం రీ వాల్యుయేషన్ చేస్తే తమకు ఉద్యోగం వస్తుందని కొందరు భావిస్తుంటే.. తమకు వచ్చిన ఉద్యోగాలు ఉంటాయో? పోతాయో? తెలియక.. అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే నేడు హైకోర్టులో విచారణ ఉండడంతో ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందా.. లేక ఈ అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తుందో తెలుసుకుందాం!

- Advertisement -

తొలి నుంచి వివాదాలే: 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైనా.. తొలి నుంచే ఈ నియామకాల ప్రక్రియ వివాదాల చుట్టే తిరుగుతోంది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2022 ఏప్రిల్ 26న 503 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికే షన్ జారీ చేశారు. 2022 అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా, 2023 ఆగస్టులో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈలోగా గ్రూప్1తో పాటు పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్1 పరీక్షను టీజీపీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్ 11న మరోసారి ప్రిలిమినరీ పరీక్ష నిర్వ హించారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-election-officer-bans-exit-polls/

ఈ పరీక్షను పారదర్శకంగా నిర్వహించ లేదని, లోపాలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్ష రద్దు అయ్యింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి మొత్తం 563 పోస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసింది. 2024 జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 10న అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల చేయగా, మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ జాబితా వచ్చింది. ఏప్రిల్ 10న 563 ఉద్యోగాలకు ఎంపికైన గ్రూప్ 1 అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసి ధ్రువపత్రాల పరిశీలనను కూడా చేపట్టింది.

ర్యాంకింగ్ జాబితాను రద్దు చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్: మెయిన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో గ్రూప్ 1 మెయిన్ పరీక్షల మార్కులు, ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ ఏడాది సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేయాలని లేదా తిరిగి మెయిన్స్ పరీక్షను ఎనిమిది నెలల్లోగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దీనిపై గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన కొందరు అభ్యర్థులు, టీజీపీఎస్సీ.. హైకోర్టు డివిజన్ బెంచు అప్పీల్కు వెళ్లడంతో సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ప్రభుత్వ నియామకాలు చేపడితే అవి రిట్ అప్పీళ్ల తుది తీర్పుకు లోబడి ఉంటాయని కూడా చెప్పడం గమనార్హం. దీంతో ఉద్యోగాలకు ఎంపిక కాని కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్‌ను కోర్టు డిస్పోజ్ చేసింది.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/telangana-opposes-andhra-pradesh-potireddypadu-expansion/

తీర్పు ఎలా వచ్చినా సుప్రీంకోర్టులో అప్పీల్: నేడు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ జరుగునుండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అంతే కాకుండా ఉద్యోగలు పొందినవారు సైతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కోర్టు తుదితీర్పుకు లోబడే మీ ఉద్యోగాలు ఉంటాయని అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థుల నుంచి అధికారులు డిక్లరేషన్ తీసుకున్నట్టు తెలిసింది. ఒకవేళ వీరికి అనుకూలంగా డివిజన్ బెంచ్ తీర్పు వస్తే వీరి ఉద్యోగాలకు భద్రత ఉంటుంది. లేకుంటే వీరు సుప్రీంకోర్టును వెళ్లే అవకాశం ఉంటుందని పలువురు అభ్యర్థులు చెప్తున్నారు. గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికకాని అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు రాకపోతే.. వారు కూడా సుప్రీంకోర్టును మళ్లీ అశ్రయించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. చివరికి ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరనున్నట్లు సమాచారం. ఎవరికి న్యాయం జరగకున్నా ఇది ఇలాగే సాగుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా నేడు హైకోర్టు తీర్పుతో ఈ ఉత్కంఠ కొంత వరకు తీరనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad