Kaleshwaram project in High Court: కాళేశ్వరంపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు చేపట్టవద్దంటూ దాఖలైన పిటీషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయడంపై నేడు కీలక విచారణ జరగనుంది.
మరికొద్ది గంటల్లో తేలనుంది: ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు చేపట్టవద్దని కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై నేడు విచారణ జరగనుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఏ రకమైన వాదనలు వినిపించే అవకాశం ఉందో మరికొద్ది గంటల్లో తేలనుంది.
ఏ క్షణంలోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు అయ్యే చాన్స్!: కేసులో ఇప్పటికే సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై జస్టీస్ పీ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రిపోర్టులతో పాటుగా కీలక డాక్యుమెంట్లను సీబీఐ సేకరించినట్లుగా సమాచారం. ఇదే అంశంపై సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విచారణ సంబంధించిన ప్రణాళికను సైతం రూపొందించినట్లుగా తెలుస్తోంది. కేసులో ప్రాథమిక పరిశీలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో సీబీఐ, కేంద్ర హోంశాఖ అనుమతితో ఏ క్షణానైనా బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


