Local body elections Notifications: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడత జరిగే మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో.. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఆటంకం లేకుండా పోయింది. దీంతో నేడు తొలిదశలో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లాల వారీగా అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
నేటి నుంచే నామినేషన్లు: రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా అందులో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా .. మిగితా 31 జిల్లాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఖాళీల వివరాలతో అధికారులు ఇప్పటికే గెజిట్ విడుదల చేశారు. ఒక్కో దశకు ఆయా తేదీలకు అనుగుణంగా ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల నోటీసులు జారీ చేసిన వెంటనే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది. నేటి నుండి నామినేషన్ల దాఖలు కు మూడురోజుల పాటు అవకాశం ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/today-hearing-on-bc-reservations-in-telangana-high-court/
పకడ్బందీగా ఏర్పాట్లు: మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ గురించి జిల్లా కలెకర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులను సమీక్షించారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును గమనించారు. ఇతర అంశాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, చేసిన సన్నాహాల గురించి ఆరా తీసీన కమిషనర్.. అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణ, పునఃశ్చరణ శిక్షణ సైతం పూర్తిచేశామని పేర్కొన్నారు.
5 దశల్లో స్థానిక సమరం: మొత్తం అయిదు దశల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలకు గాను..తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత అక్టోబర్ 23న, రెండో విడత అక్టోబర్ 30న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు. ఆ తర్వాత మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు..సర్పంచ్, వార్డు సభ్యులకు ఏన్నికలను ఈసీ నిర్వహించనున్నారు. మొదటి దశ అక్టోబర్ 31న, రెండోదశ నవంబర్ 4న, మూడోదశ నవంబర్ 8న సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.


