Maganti Sunitha nomination: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రసవత్తరంగా మారుతుంది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి హంగూఆర్భాటానికి తావు లేకుండా తొలిసెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
సునీత వెంట కేటీఆర్: బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. తొలిసెట్ నామినేషన్ పత్రాలను ఎలాంటి హంగూఆర్భాటానికి తావు లేకుండానే ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన షేక్‌పేట్ తహసీల్దార్‌కు సమర్పించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నలుగురితో వెళ్లి సునీత నామినేషన్ వేయనున్నారు. సునీత వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు వెళ్లారు. ఈ నెల 19న మరో సెట్ నామి నేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ భారీ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్‌ఎస్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.
కేసీఆర్‌తో సునీత భేటి: కాగా మాగంటి సునీత మంగళవారం ఎర్రవల్లి నివాసంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేతుల మీదుగా సునీత బీ-ఫామ్‌ను అందుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున సునీతకు రూ.40 లక్షల చెక్కును సైతం కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు మాజీ మంత్రులు పద్మారావుగౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/kcr-maganti-sunitha-jubilee-hills-bypoll-b-form-brs/
గోపీనాథ్ సేవలను గుర్తించిన కేసీఆర్: మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. గోపీనాథ్ మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీకి గోపీనాథ్ చేసిన సేవలను గుర్తించిన కేసీఆర్.. ఆయన సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా దివంగత నేత కుటుంబానికి అండగా నిలవడంతో పాటుగా.. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న బలమైన కేడర్ మరియు మాగంటి కుటుంబానికి ఉన్న సానుభూతిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కేసీఆర్‌కు చేతులమీదుగా బీ-ఫామ్ తీసుకున్న అనంతరం మాగంటి సునీత అధినతకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాలని బీఆర్‌ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది.


