Sunday, November 16, 2025
HomeతెలంగాణPulse Polio: పేరెంట్స్‌కి అలర్ట్.. నేడు పోలియో చుక్కల మందు పంపిణీ

Pulse Polio: పేరెంట్స్‌కి అలర్ట్.. నేడు పోలియో చుక్కల మందు పంపిణీ

Pulse Polio Vaccination: చిన్నారుల నిండు జీవితాన్ని సురక్షితం చేసేందుకు రెండు చుక్కలు వేసే సమయం నేడు ఆసన్నమైంది. వైకల్యానికి కారణం అయ్యే పొలియో వైరస్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు ప్రభుత్వం పోలియో చుక్కల కార్యక్రమాలను ఏటా పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నాయి. నేడు పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో.. ఇప్పటికే జన సంచారం ఎక్కువగా ఉండే చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలపై అవగాహన కప్పించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

ఐదు జిల్లాలు ఎంపిక: దేశవ్యాప్తంగా 290 జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ నిర్వహిస్తుండగా.. తెలంగాణలోని 5 జిల్లాలు ఈ స్పెషల్ డ్రైవ్‌కు ఎంపిక అయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో పోలియో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నేడు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలో సైతం పోలియో చుక్కలు వేయనున్నారు.

ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరి: పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన తల్లిదండ్రులను కోరారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు 11,200 మంది సిబ్బంది ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. జంట నగరాల్లో మొత్తం 5,17,238 పిల్లలకి 2,843 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 6 వరకు పోలియో చుక్కల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలు తెరిచి ఉంటాయన్నారు. హైదరాబాద్‌ జిల్లాలోని 9,36,016 ఇండ్లను కవర్ చేస్తూ డ్రాప్స్ వేయనున్నట్లు కలెక్టర్‌ హరిచందన తెలిపారు.

91 మొబైల్ టీంలు: మొత్తం 2,586 బూత్‌లు, 50 ట్రాన్సిట్ పాయింట్లు (సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, అమీర్‌పేట్ మెట్రో, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ) ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జిల్లా డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకటి వివరాలు వెల్లడించారు. అంతేకాకుండా 91 మొబైల్ టీంలు నగరమంతా పనిచేస్తాయని అన్నారు. ఉదయం 7 గంటలకు బూత్ లు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ ఐదేండ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా డ్రాప్స్ వేయించాలని ఆయన కోరారు.

164 హై రిస్క్ ప్రాంతాలు: పోలియో చుక్కల మొదటి రోజైన ఆదివారం మొత్తం 164 హై రిస్క్ ప్రాంతాలు కవర్ చేయనున్నట్టు వెంకటి తెలిపారు. 91 మొబైల్ టీంలు నిర్మాణ ప్రదేశాలు, వలసవాసుల ప్రాంతాలు, భిక్షుకుల సమాజాలు, తాత్కాలిక నివాసాలు, మార్కెట్లు, దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలు, మసీదులు, వివాహ భవనాలు, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, జూ పార్క్ వంటి ప్రజా ప్రదేశాలలో పిల్లలకు పోలియో డ్రాప్స్ వెసేందుకు ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ వెంకటి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విభాగాల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కాలేజ్ విద్యార్థులు, ఎన్ సీసీ , నర్సింగ్ , మెడికల్ విద్యార్థులు, కాంటోన్మెంట్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆంగన్‌వాడీ సిబ్బంది, మహిళా మండళ్లు , ఇతర వాలంటీర్లు పాల్గొంటారని అన్నారు. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, చిన్నారుల క్లినిక్స్, కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాయని అన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad