TG Weather updates: తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో వర్షపాతం లోటు గణనీయంగా తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఈ నెల 29 వరకు ఇలాగే మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంగా.. వరంగల్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడి.. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా జూన్ నెలలో 109.3 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 88.7 మి.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది. దీంతో వర్షపాతం లోటు -19%కి తగ్గింది. ఇది సానుకూల పరిణామంగా చెప్పవచ్చునని పేర్కొంది.
హైదరాబాద్‌లో:
హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షపాతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మే నెలలో జూన్ నెల కంటే నాలుగు రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ నెలలో 93.8 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 30.1 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో హైదరాబాద్‌లో వర్షపాతం లోటు -68%గా ఉంది. 2000 మరియు 2014 తర్వాత హైదరాబాద్‌కు ఇది అత్యంత దారుణమైన జూన్ నెలగా నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద వర్షపాతం లోటు తగ్గుముఖం పట్టినా, హైదరాబాద్ నగరంలో మాత్రం పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. జూలై నెలలో కురిసే వర్షాలపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాబోయే ఐదు రోజుల్లో హైదరాబాద్‌లో స్వల్ప వర్షాలు తప్ప భారీ వర్షాలు లేకపోవడంతో, జూన్ నెలలో ఆ లోటు భర్తీ అయ్యే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. అయితే జూలై నెలలో మాత్రం మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.