Today Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్ప పీడన ప్రభావంతో వర్షపాతం గణనీయంగా పెరుగుతోందని శుభవార్త చెప్పింది. ఈరోజు, రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ముసురుతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం గణనీయంగా పెరిగి, వర్షాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా జూలై మొదటి వారం నుండి రుతుపవనాలు మరింత చురుకుగా మారతాయని అధికారులు ముందుగానే అంచనా వేశారు.
ఈ ప్రాంతాలకు అలర్ట్ జారీ:
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైనా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గడిచిన 24 గంటల్లో:
గత 24 గంటల్లో, మధ్య, తూర్పు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అద్భుతమైన వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో చాలా కాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఊరటనిచ్చింది. హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు ముసురు వాతావరణంతో కూడిన మోస్తరు వర్షాలు కురిసాయి. పగటిపూట ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడా చిరు జల్లులు కురిసినా.. సాయంత్రం వరకు వర్షం మొదలైంది. రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. తెల్లవారు జాము వరకు ఇవి కొనసాగాయి.
తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు చురుకుగా మారడానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూలై మొదటి వారం నుండి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి, రైతాంగానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు కీలకమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.