CM Revanth Reddy Delhi Tour: డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సమావేశానికి నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లనున్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి పాల్గొంటారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో.. ఈ అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఒక్కో డీసీసీకి ముగ్గురు పేర్లు: ఈ మేరకు తెలంగాణకు 22 మంది పరిశీలకులను నియమించింది. ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏఐసీసీ సీనియర్ నాయకులను ఇన్చార్జీలుగా నియమించింది. ఈ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. పదవి కోసం దిల్లీ స్థాయిలో పైరవీలు షురూ చేశారు. కాగా.. ఒక్కో డీసీసీకి ముగ్గురు పేర్లను హైకమాండ్ పరిశీలనలోకి తీసుకుంది. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లు దిల్లీ పర్యటనలో రాష్ట్రంలో మంత్రులు, నేతల మధ్య వివాదాలు, బీసీ రిజర్వేషన్లపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నట్లుగా సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
నెలాఖరులో ప్రకటించే అవకాశం: జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఇటీవల జిల్లా పర్యటనలు చేసిన ఏఐసీసీ పరిశీలకులు.. వర్గాల వారీగా ఒక్కో కమిటీకి ఆరుగురితో ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. వాటిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్, భట్టి, మహేశ్ గౌడ్, మీనాక్షి, ఉత్తమ్.. తమ అభిప్రాయాలు తెలపనున్నారు. ఈ భేటీలో డీసీసీ అధ్యక్షులతో పాటు పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆమోద ముద్ర తర్వాత ఈ నెలాఖరుకు లేదా నవంబర్ మొదటి వారంలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


