Weather Forecast updates: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండడంతోనే రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఉత్తర తమిళనాడు తీర పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణశాఖ వివరించింది. దీని ప్రభావం సైతం రాష్ట్ర వాతావరణ మార్పులకు కారణమని అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దూర్‌లో 7 సెం.మీ ల వర్షం: మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఖమ్మం జిల్లా కారేపల్లిలో అత్యధికంగా 7 సెం.మీ, రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్ లో 6.5 సెం.మీ, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో 6.4 సెం.మీ, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో 5.5 సెం.మీ, వికారాబాద్ జిల్లా చౌదాపూర్ లో 5.2 సెం.మీ, రంగారెడ్డి జిల్లా తొమ్మిడిరేకులలో 5 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.
పిడుగులు పడే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి: నేడు వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వివరించారు. వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మిగితా జిల్లాల్లో పెద్దగా వర్షాల ప్రభావం ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. ఏదేశమైనప్పటికీ వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


