Weather Forecast: వర్షాకాలం ముగిసినా.. నైరుతీ రుతుపవనాలు వెళ్లిపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. నవంబర్ నెల ప్రారంభమైనప్పటికీ ఎక్కడో ఒకచోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే నేడు భిన్న వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం వాతావరణం కాస్త చలితో కూడిన పొడి గాలులు వీస్తాయని తెలిపింది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటుందని తెలిపింది. సాయంత్రం వేలలో ఆకాశం మేఘావృమై ఉన్నప్పటికీ.. ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా.. కేవలం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అన్నారు. అలాంటి సమయంలో పిడుగులు సైతం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించారు. చెట్ల కింద ఎట్టిపరిస్థితిలో ఉండరాదని తెలిపారు.
మొదలైన చలి: రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మొదలైంది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రతలో మార్పు చోటుచేసుకుంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం అతితక్కువగా 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చలి ఎక్కువగా వణికిస్తున్నది. రాత్రిపూట ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.హెచ్‌సీయూ ప్రాంతం లో 17.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 18.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని అటవీ విస్తీర్ణం వల్ల సహజంగానే చల్లటి వాతావరణం ఉంటుందని తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఈ నెల 9న మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అంతగా లేని ప్రభావం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి..ఈ నెల 9న ఒక ఆవర్తనం ఏర్పడబోతోందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది ఈ నెల 10వ తేదీకి అల్పపీడనంగా మారుతుందని అన్నారు. అది చెన్నైకి తూర్పు దిశగా 510 కిలోమీటర్ల దూరంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలిపారు. అది ఎటువైపు వెళ్తుందో ఇప్పుడే చెప్పలేం అన్నారు. అయితే దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఉండే అవకాశం లేదని అన్నారు. అయినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


