Urban bank elections in Karimnagar: నేడు జరగనున్న అర్బన్ బ్యాంకు ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల ఏడు వందల వరకు ఓటర్లుగా ఉన్న అర్బన్ బ్యాంకు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కరీంనగర్, జగిత్యాలలో పోలింగ్ సెంటర్ లను ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రిని ఆయా సెంటర్లకు శుక్రవారం సాయంత్రమే తరలించారు. నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
రసవత్తరంగా పోటీ: అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో మూడు ప్యానల్‌లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబందించినవే కావడంతో.. కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. అయితే అధికార పార్టీలో ఆసక్తికర పోటీ జరుగుతుండటంతో బీజేపీ, బీఆర్ఎస్ లు తెరవెనుక చక్రం తిప్పుతున్నాయి. ముగ్గురిలో ఓ వర్గానికి తమ మద్దతునిస్తూ తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బరిలో దించగ నువ్వా నేనా అన్నట్టు పోటా పోటీ నెలకొంది. మూడు ప్యానల్‌ల కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం తమకు మంత్రుల సంపూర్ణ మద్దతు ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇక్కడ విచిత్ర పరిస్థితి నెలకొని ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. అయితే మూడు పార్టీల నేతలు సైతం తెరవెనుక చక్రం తిప్పుతు అర్బన్ బ్యాంకుపై తమ గుత్తాధిపత్యం చేజారకుండా చూసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రాత్రికి విజేత ఎవరనేది తెలియనుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తప్పుల తడకగా ఓటరు జాబిత!: అర్బన్ బ్యాంకు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన అభ్యర్థులు మునుపెన్నడు లేనివిధంగా ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే ఓటరు జాబిత తప్పుల తడకగా ఉందని కొందరు అభ్యర్థులు ఆరోపించారు. ఓటర్ల జాబితాలో దోర్లిన తప్పులు ఎవరికి ప్రయోజనం చేకూరనుందో అనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే ముందు నుంచి బ్యాంకుపై పట్టున్న కొంతమంది నాయకులు తమ పట్టుసడలకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరణించిన సభ్యుల ఓట్లను తొలగించకపోవడం పరిమిత వయస్సు లేని వారి పేర్లు సైతం ఓటరు జాబితాలో నమోదు కావడం సహజంగా దోర్లిన పొరపాట్ల లేక ప్లాన్ ప్రకారం జరిగిందా అనేది చర్చనీయాంశంగా మారింది.


