Today Rain in tg: రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ఉన్న ముసురు వాతావరణంలో నేడు మార్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండలు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని అయితే ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది. ఉత్తర, పశ్చిమ, మధ్య తుఫాన్ జిల్లాల్లో కాస్త వేడి పెరగడం వల్ల మధ్యాహ్నం, రాత్రి సమయంలో అకస్మాత్తుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగానే ఉంటుందని.. సాయంత్రం నుంచి రాత్రి కొద్ది సేపు మోస్తరు వర్షం పడుతుందని తెలిపింది.
తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. అల్ప పీడన ప్రభావంతో వర్షపాతం గణనీయంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో ముసురుతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మంచి వర్షాలు కురిసాయని హైదరాబాద వాతావరణ కేంద్రం ఇప్పటికే చెప్పింది. హైదరాబాద్ నగరంతో పాటు మొత్తం తెలంగాణ లోని చాలా చోట్ల 30-40 మి.మీ. విస్తృతంగా వర్షాలు కురిసాయి. గత జూన్ నెల వర్షాల లోటు నుంచి రాష్ట్రం ఇప్పుడు వేగంగా కోలుకుంటోందని నిన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం గణనీయంగా పెరిగి, వర్షాలు విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో:
గత రాత్రి వర్షాలు ఊహించిన విధంగానే కురిసాయి అని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసాయని పేర్కొంది. అలాగే నిన్న మెదక్, సిద్దిపేటలో జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసాయని పేర్కొంది. వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణ పేటలో మోస్తరు వర్షాలు పడ్డాయని తెలిపింది. ఇక హైదరాబాద్ లో రాత్రి పూట వర్షపు జల్లులు పడ్డాయని తెలిపింది.
తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు చురుకుగా మారడానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి, రైతాంగానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది.