400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) భూముల వివాదం తెలంగాణలో పెను దుమారానికి దారి తీస్తోంది. ఆ భూముల్లోని చెట్ల నరికివేతను ఆపాలని హెచ్‌సీయూ(HCU) విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా విద్యార్థులకు మద్దతు లభిస్తోంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతిస్తున్నట్లు టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba) సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఇక కేబీఆర్ పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆందోళనకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మద్దతు తెలిపారు. ఇప్పటికే దర్శకడు నాగ్ అశ్విన్ ఈ భూముల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. ముమ్మాటికీ ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును లేవనెత్తుతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ భూముల వేలం వేస్తున్నామని చెబుతోంది. మొత్తానికి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.