డబ్బు వ్యామోహం కన్నా రాజకీయ వ్యామోహంతో చేసే పనులు చాలా డేంజర్ అని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అదానీ (Adani) కేసుల వ్యవహారంపై స్పందించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అదాని, అంబానీ ల ఆస్తులు వందల రెట్లు పెరిగిపోయాయన్నారు.
అదానీ స్టాక్ మార్కెట్ ను మ్యానిప్యులేట్ చేశారని, ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు అని మహేష్ కుమార్ ప్రశ్నించారు. “అదానీ అరెస్ట్ అయితే మన ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు. అదానీ మోసాలలో ప్రధాని కి కూడా ప్రధాన భాగస్వామ్యం ఉంది కాబట్టి మోడీ మాట్లాడడం లేదు” అని ఆరోపించారు.
అదానీ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని, ఆయనని అరెస్టు చేయాలనీ టీపీసీసీ చీఫ్ (TPCC Chief) డిమాండ్ చేశారు. అదానీకి తమ ప్రభుత్వం తెలంగాణలో గుంట భూమి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ తో చేసుకున్న ఒప్పందాల పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళతాము అని మహేష్ కుమార్ తెలిపారు.