కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్(Union Budget 2025)లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగింటి కోడలు అయిన నిర్మలా సీతారామన్ తెలంగాణపై కొంచెం కూడా ప్రేమ చూపించలేదన్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు గాడిద గడ్డు ఇచ్చారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని ఫైర్ అయ్యారు. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం తెలంగాకు ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు కూడా జరపలేదని మండిపడ్డారు.
ఇది కేంద్ర బడ్జెట్‌లాగా లేదని కేవలం బీహార్ ఎన్నికల బడ్జెట్‌లాగా ఉందని విమర్శించారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించారని ఆయన తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి వసూలు చేసే కేంద్రం.. బడ్జెట్‌లో మాత్రం అందరినీ సమానంగా చూడటం లేదన్నారు. కాగా ఈ బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది.