TPCC Chief Media Chitchat in Delhi: దిల్లీలో నిర్వహించిన విలేకరుల చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఈ నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు రావచ్చని తెలిపారు. పార్టీలో రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉన్నప్పటికీ.. కొంతమంది ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చేందుకు హైకమాండ్ ఆలోచిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాల్లో నిక్కచ్చిగా ఉండదని తెలిపారు.
ఆ విషయం నాకు తెలియదు: ఎమ్మెల్యేలకు డీసీసీ అనేది పదవి కిందకు రాదని టీపీసీసీ చీఫ్ తెలిపారు. అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ల ఛైర్మన్లను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని అన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి దరఖాస్తు చేసుకున్నారన్న విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పదవులు పాత వారికే ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా మహేశ్ కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. వారం పదిరోజుల్లో డీసీసీలను ప్రకటించే అవకాశం ఉందని అన్నారు.
గీత దాటితే.. అధిష్టానం నిఘాలో: ఎంతటివారైనా పార్టీకి లోబడి ఉండాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గీత దాటితే తనతోసహా ఎవరైనా అధిష్టానం నిఘాలో ఉంటారని అన్నారు. గోడలకు సైతం చెవులుంటాయనే విషయాన్ని గ్రహించి నేతలు జాగ్రత్తగా మాట్లాలని కోరారు. మంత్రుల మధ్య చోటుచేసుకున్న వివాదం ముగిసిన అధ్యాయమని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ అంశంపై అధిష్టానానికి వివరణ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఆమె పార్టీ వ్యక్తి కాదు: మంత్రుల మధ్య విభేదాలపై అధిష్టానం తనని అడిగినట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కొండా సురేఖ, పొంగులేటి వివాదం..ముగిసిందని అన్నారు. కొండా సురేఖ కూతురు అలా మాట్లాడాల్సింది కాదని తెలిపారు. అసలు ఆమె పార్టీ వ్యక్తి కాదని అన్నారు. ఈ అంశంపై కొండా సురేఖను పిలిచి మాట్టాడి మందలించిన అంశాన్ని గుర్తుచేశారు.
ఓట్‌చోరీకి హైదరాబాద్‌లోనే బీజం: బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో 40 నుంచి 50 లక్షల ఓట్లు తొలగించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ ఆరోపించారు. ఓట్ చోరీకి మొదట హైదరాబాద్‌లోనే బీజం పడిందని తెలిపారు. కులం మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని అన్నారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ను తాను గౌరవిస్తానని టీపీసీసీ చీఫ్ చెప్పారు. ఉద్యమంలో ఆయన ముందుండి పోరాటం చేశారు కానీ.. పదేళ్ల పాలనలో ప్రజల సమస్యలను తీర్చలేదని అన్నారు.


