Mahesh Kumar Goud:ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తన పదవి కాలం ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. ‘రాబోయే రోజుల్లో బీసీ సీఎం తప్పకుండా అవుతారు. బీసీలకు కాంగ్రెస్‌తోనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ఈ ఏడాది కాలంగా సీఎం, మంత్రులు చాలా సహకరించారు. నా హయాంలో ఇన్ని కార్యక్రమాలు జరగడం సంతోషంగా ఉంది. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత నాకు పీసీసీ చీఫ్‌గా అవకాశం వచ్చింది. గాంధీ భవన్‌లో చేపట్టిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చింది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో కూడా మొదలు పెడుతున్నాయి. పథకాల్లోనూ, పార్టీ పరంగా రోల్ మోడల్‌గా నిలుస్తున్నాం. మీనాక్షి నటరాజన్ ఇన్‌చార్జిగా రావడం చాలా సంతోషం. పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రతి నెలలో జనహిత పాదయాత్ర ఉంటుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే నా కర్తవ్యం. పార్టీలో క్రియాశీలకంగా పని చేసినందునే పదవులు వచ్చాయి. నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. నాకు మంత్రి పదవి ఇచ్చినా తిరస్కరించాను. నాకు సీఎం రేవంత్ రెడ్డితో మంచి అనుబంధం ఉంది. ఇద్దరం జోడెద్దులాగా పని చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మంత్రి పదవుల విషయంలో ఏఐసీసీ నిర్ణయం ఫైనల్. కోమటి రెడ్డి సోదరుల విషయంలోనూ అలాగే జరిగింది. రాజ్ గోపాల్ రెడ్డి విషయం హైకమాండ్ చూసుకుంటుంది’ అని వివరించారు. ‘పార్టీని బలోపేతం చేయడమే నా ముందున్న లక్ష్యం. మరో పది రోజుల్లో పార్టీ పదవులన్నింటినీ భర్తీ చేస్తాం. స్థానిక ఎన్నికల కంటే ముందే కార్పొరేషన్ పదవులు ఇస్తాం. డీసీసీల నియామకం కూడా త్వరలో పూర్తవుతుంది. ఈ సారి అభ్యర్థుల ఎంపికలో డీసీసీల పాత్ర కీలకం కాబోతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. అందుకే ఆశావహుల సంఖ్య పెరుగుతుంది. దానం నాగేందర్ కూడా రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తా అంటున్నాడు. కానీ ఆయన సభ్యత్వం పోదని అనుకుంటున్నాం’ అని చెప్పారు.
కేసీఆర్ కుటుంబం డ్రామాలు
‘కేసీఆర్ కుటుంబం కావాలనే డ్రామా చేస్తున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు పక్కదారి పట్టించేందుకు ఇదంతా చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. తెలంగాణ ప్రజలను నమ్మించే అలవాటు వాళ్లకు ఉంది. ప్రతి ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి.. ప్రజలను మోసం చేశారు.
కవిత ఒక మంచి పని చేసింది. హరీశ్ రావు, సంతోష్ రావు ఎలా దోచుకున్నారో చెప్పారు. ధనం, పవర్ కోసమే కవిత, కేటీఆర్ పంచాయితీ. ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోం. ఏఐసీసీ కూడా ఒప్పుకోదు. అవినీతి మరకలు ఉన్న వాళ్లు మాకు అవసరం లేదు అని మహేశ్ గౌడ్ తేల్చి చెప్పారు.
మహేశ్ గౌడ్‌కు సన్మానం
పీసీసీ చీఫ్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత సంగిశెట్టి జగదీశ్వర్ రావు శాలువాతో సన్మానించారు.
ఖైరతాబాద్ గణేశ్ దర్శనం
ఖైరతాబాద్ గణనాథుడికి మహేశ్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే దానం నాగేందర్, గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు సన్మానించారు. అనంతరం గణపతి ప్రతిమను బహూకరించారు.


