నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన నాయకులను పిలిచి మందలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని చురకలు అంటించారు. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని తెలిపారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ఉండాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇదే అదునుగా బీజేపీ నేతలు కూడా దాడులు చేయడం సరికాదని సూచించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా బీజేపీ నాయకులు సహకరించాలని కోరారు.
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత రమేష్ బిధూరీ(Ramesh Bidhuri) తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. బీజేపీ నేతలు వారిని అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్‌పై రాళ్ల దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.