తెలంగాణలో ఒకే రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వేర్వేరు కారణాలతో కానిస్టేబుళ్లు సాయికుమార్, బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. కొల్చారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కానిస్టేబుల్ సాయి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది గమనించిన తోటి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సిద్దిపేటలో కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యయత్నం చేశారు. పురుగుల మందు తాగిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోలీస్ట్ డిపార్ట్‌మెంట్‌లో కొద్ది రోజుల వ్యవధిలోనే వరుస ఆత్మహత్యలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కామారెడ్డిలో ముగ్గురు పోలీసుల ఆత్మహత్యల ఘటన మరువకముందే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.