Tragic Death : హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఒక ప్రైవేట్ క్లినిక్‌లో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా 11 ఏళ్ల బాలిక మరణించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోచంపల్లి భీమనపల్లికి చెందిన ఈ బాలిక రెండు రోజుల క్రితం గొంతులో 10 రూపాయల నాణెం ఇరుక్కుపోవడంతో కుటుంబ సభ్యులు ఆ క్లినిక్‌కు తీసుకొచ్చారు. వైద్యులు నాణెం బయటకు తీసి ఆమెను ఇంటికి పంపించేశారు.
అయితే, ఒక రోజు తర్వాత బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తిరిగి అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూనే సెప్టెంబర్ 20న బాలిక మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
Shirdi : షిర్డీ టూర్ స్పెషల్ ప్యాకేజీ..హైదరాబాద్ నుంచే..
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆస్పత్రి నిర్వాహకులు చిన్నపాటి నర్సింగ్ క్లినిక్ అనుమతులతోనే ఆపరేషన్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దుర్ఘటనకు కారణమైన క్లినిక్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


